పంచతంత్రం – బొజ్జా తారకం

     ఈ పుస్తకం చదివిన తరువాత రివ్యూ రాయాలనిపించింది, కాని ఎలా రాయాలో తెలియలేదు. తరువాత కొంచెం ఆలోచించి, ఒక స్నేహితుడికి ఈ పుస్తకం గురుంచి చెప్పాలంటే ఎలా, ఏమని చెప్తానో అదే రివ్యూగా రాద్ధామని నిర్ణయించుకున్నాను.
    పుస్తకం చదవటం ముగించగానే ఎన్నోఆలోచనలు, బాధ మరియు కోపం కలిగాయి. పేరుకి ఇది నవలే అయినా, పుస్తకం చదువుతున్నంత సేపు ఆ పాత్రలు, సంఘటనలు నా కళ్ళ ​ముందు జరుగుతున్నట్లుగా అనిపించింది.ఈ పుస్తకం దళితుల ​మీద రచన. రచయిత దళితుల ​కష్టాలు, బాధలు, మరియు వారికే జరిగే అవమానాలు, అన్యాయాలని ఒక కధా రూపంలో వెల్లడించటానికి ప్రయత్నించారు.


    కధ అంతా కారుపాలెం అనే పల్లెటూరు, దానికి ఆనుకునే కొంచెం దూరంగా ఉన్న మూలపల్లి అనే ఒక పేట దగ్గరిలొ జరుగుతుంది. కారుపాలెంలో మోతుబరులుంటారు, మూలపల్లిలో దళితులు ఉంటారు. కారుపాలెంలో విశ్వనాధం అనే పెద్ద మోతుబరి ఉంటాడు. ఇతనికి ఆస్తిపాస్తులు చాలా ఉంటాయి. గవర్నమెంటు వారి భూములు చాలా వరకు ఆక్రమించుకొని అక్రమంగా పండించుకొంటూ ఉంటాడు. కరణం, మునసబు, తాసిల్దారు, మరియు పోలీసులని డబ్బుతో తన చెప్పుచేతల్లో ఉంచుకుంటాడు. తన మాటకు  ఎవరూ ఎదురు చెప్పకుండా చూసుకుంటాడు. ఇతనంటే ఊరిలో అందరికి భయమే.
          మూలపల్లిలో ఉండేది అంతా పాలేర్లు మరియు కూలివాళ్ళు. అక్కడ ఉండే సూరన్న అనే అతను విశ్వనాధం ఇంట్లో పాలేరుగా పనిచేస్తూ ఉంటాడు. విశ్వనాధంకి ఒక్కటే కూతురు, తన పేరు లక్ష్మి. ఈ లక్ష్మి, సూరన్నని ఇష్టపడుతుంది. ఒకరోజు ఎవరికి తెలియకుండా లక్ష్మి, సూరన్నతో ఒక రాత్రి గడుపుతుంది. ఆ తరువాత విశ్వనాధం, తన కూతురు, సూరన్న వల్లె తల్లి అయిందని తెలుసుకొని, అతని మీద దోంగతనం నేరం మోపి, చంపిస్తాడు. తన కొడుకు చావుకు కారణమయిన వారి మీద కేసుపెట్టాలని ప్రయత్నిస్తున్న సూరన్న తండ్రిని కూడా చంపేస్తారు. కొడుకుని మరియు భర్తని పోగొట్టుకున్న, సూరన్నతల్లి ఆదెమ్మ ఒంటరి అవుతుంది.
లక్ష్మి తన కడుపులో ఉన్న బిడ్దని ఎలాగయినా కాపాడుకోవాలనుకుంటుంది. అందుకోసం బిడ్దని కననిస్తేనే, తన మేనమామ కొడుకుని పెళ్లి చేసుకుంటానంటుంది. వాళ్ళ అమ్మ అలాగె ఒప్పుకుంటుంది. అలా పెళ్లి చేసుకున్న తరువాత గర్భవతి అయిందని అందరినీ నమ్మిస్తారు. కానీ కాన్పు జరిగిన తరువాత, ఆ బిడ్డని ఎవరికి తెలియకుండా ఆదెమ్మ ఇంటిముందు వదిలేస్తారు. ఆదెమ్మ తనకు దేవుడిచ్చిన బిడ్డ అనుకోని, తన కొడుకు పేరే పెట్టుకొని సొంత మనవాడిలా సాకుతుంది.
       లక్ష్మికి తరువాత కాన్పులో మరో మగబిడ్దపుడతాడు, ఇతడే దత్తుడు. తాతగారి పొగరుని, అహంకారాన్ని, డబ్బుతో ఏమయినా చేయొచ్చనే మనస్తత్వాన్ని బాగా పుణికి పుచ్చుకుంటాడు. దత్తుడికి వరసయిన ​మేనత్త కూతురు రమ.
             మూలపల్లిలో సొంత పొలం ఉన్న ఒకే ఒక వ్యక్తి మిలట్రీ సుబ్బారావు. ఇతను మిలట్రీలో పనిచేసి రిటైర్ అయ్యి, వచ్చే పెన్షన్తో మరియు పొలం వేసుకుంటూ బ్రతుకుతూంటాడు. ఇతనికి ఒక్కటే కూతురు గౌరి. గౌరిని ఎలాగయినా బాగా చదివించి పెద్ద డాక్టర్ని చేయాలని కోరిక.
              రమ, గౌరీ, దత్తుడు మరియు సూరన్న చదువులు ఆ ఊరి బడిలో మొదలవుతాయి. రమ మరియు గౌరీ మంచి స్నేహితులవుతారు. దత్తుడు తప్ప, మిగతా ముగ్గురు బాగా చదువుతూ ఉంటారు. సూరన్నకి చదువుకోవటం మొదలుపెట్టిన దగ్గరి నుంచి అన్ని సందేహాలే. కులపరంగా మనుషులు ఎందుకు విడిపోతారు? మిగతా కులాలవాళ్ళు తమని ఎందుకు అంత నీచంగా చూస్తారు? ఇలా సూరన్న ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక బడిలో అగ్రకులాలవాళ్ళు వారితో ప్రవర్తించే విదానం, బడికి ఎదురుగా ఉన్న హోటల్లోకి వీళ్లను రానివ్వకపోవటం, స్కూల్ లీడర్ కోసం జరిగే ఎన్నికలలో తన స్నేహితుడు చంపబడటం, చేయని నేరానికి తాను జైలు పాలుకావడం,  అన్ని సూరన్నని బాగా కలిచివేస్తాయి. ఇన్ని గొడవల్లొనూ సూరన్న, గౌరీ, మరియు రమ 10వతరగతి పాసవుతారు. దత్తుడు తప్పుతాడు.
               పై చదువుల కోసం ముగ్గురు పట్నం చేరతారు. రమ, గౌరీ ఉమెన్స్ కాలేజ్లో జాయిన్ అవుతారు. గౌరి గవర్నమెంట్ హాస్టల్లో ఉంటుంది. రమ చుట్టాల వారి ఇంట్లో ఉంటుంది. సూరన్న బాయ్స్ కాలేజ్లో జాయిన్ అవుతాడు. సూరన్న కూడా గవర్నమెంట్ హాస్టల్లో ఉంటాడు. సూరన్నకి ఇక్కడి విషయాలన్ని కొత్తగా ఉంటాయి. హాస్టల్లో మరియు తన ఊరిలో అందరితో కలిసి అన్యాయాల్ని ఎదుర్కొంటాడు. వార్డెన్ అవినీతిని ఎదిరించడం, తమ పేటకు రోడ్డు రావటంలో ముఖ్యపాత్ర వహించడం, కూలి రెట్లు పెంచటానికి చేసే సమ్మెలో కీలక పాత్ర పోషించటం, ఇలా ప్రతి విషయంలో ఊరి వారికి చేదోడు వాదోడుగా ఉంటాడు. మోతుబరులు చేసే ప్రతి తప్పుకు అడ్డు నిలుస్తాడు.
       ఇవన్ని చూస్తున్న దత్తుడు సూరన్నని ఏమీ చేయలేక, తన స్నేహితురాలయిన గౌరిని ఏదో ఒకటి చేయాలి అనుకుంటాడు. అలాగే ఒక రోజు సూరన్న, గౌరీ పట్నం నుంచి బస్ దిగి ఊరికి వస్తున్న సమయంలో, అందరూ చూస్తుండగానే దత్తుడు, ఇంకా నలుగురు వచ్చి సూరన్నని కొట్టి, గౌరిని ఎత్తుకు పోతారు. గౌరిని మానభంగం చేసి, అత్యంత క్రూరంగా చంపేసి, ఎత్తుకు వెళ్లిన చోటే దిసమొలతో రోడ్డు మీదే పడేస్తారు. సూరన్న, గౌరికి జరిగిన దారుణాన్ని చూసి తట్టుకోలేకపోతాడు. అందరూ కలిసి దత్తుడికి శిక్ష పడి, గౌరికి న్యాయం జరగాలని పొలిస్ కేస్ పెడతారు. కోర్ట్లో కేసు నడుస్తూ ఉంటుంది. చివరికి వారికి న్యాయం జరుగుతుందా?

ఒక్కసారి పుస్తకం చదవటం మొదలుపెట్టిన తరువాత ఆపకుండా చదివిస్తుంది.

Hyderabad Book Trust వారు ప్రచురించిన ఈ పుస్తకం వెల Rs 100. 

ఈ పుస్తకం కినిగె లొ ఇక్కడ లభ్యం. 

One comment

Leave a comment